హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు, స్వరాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన సాహసోపేత అడుగును ఆదిలోనే గుర్తించిన ఉత్తరాదికి చెందిన తొలి పోరాటయోధుడు జేఎంఎం నేత శిబూ సొరేన్. 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ నాయకత్వంలో సాగిన అలుపెరుగని పోరుకు ప్రత్యక్షసాక్షి. ‘జార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం మేము దశాబ్దాలపాటు ఉద్యమిస్తే కానీ మా నినాదం ఢిల్లీ చేరలేదు. కానీ, కేసీఆర్ అనుసరించిన వ్యూహచతురతతో మూడేండ్లకే తెలంగాణ నినాదం ఢిల్లీకి చేరింది’ అని అబ్బురపడిన ఆదివాసీ యోధుడు శిబూ సొరేన్. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పోరాటానికి ప్రత్యేకించి కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని ఆదిలోనే ఆయన గుర్తించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా 2001 ఏప్రిల్ 27వ తేదీన కరీంనగర్ సింహగర్జన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన శిబూ సొరేన్ లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ ప్రజలను దీవించారు. ‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించి తీరుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దాకా నేను మీ నాయకుడు కేసీఆర్‌తో ఉంటా’ అని ప్రకటించారు.
ఆయన చెప్పినట్లుగానే 2004లో యూపీఏ భాగస్వామ్య పార్టీగా జేఎంఎం, 2014లో రాష్ట్రం ఏర్పడే దాకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాటానికి అండగా నిలిచింది. అలాగే, పోలవరం ప్రాజెక్టుతో లక్షలాది మంది ఆదివాసీలు నిరాశ్రయులు అవుతున్నారని గుర్తించిన బీఆర్ఎస్ 2006లో భద్రాచలంలో నిర్వహించిన ‘పోలవరం గర్జన’ బహిరంగ సభలో శిబూ సొరేన్ పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజనుల పాలిట పోలవరం శాపంగా పరిణమిస్తుందని కేసీఆర్ గుర్తించి పోరాటం చేయటం గొప్ప విషయమని, రాజకీయ నాయకులు, పార్టీలు ఆదివాసీలను విస్మరిస్తున్న సందర్భంలో కేసీఆర్ లాంటి నాయకుడు గిరిజన గొంతు వినిపించి వారికి అండగా నిలువటం స్వాతంత్య్రానంతర భారతంలో అరుదైన సంఘటనగా నాటి సభలో శిబూ సొరేన్ ప్రశంసించారు. అనేక పోరాటాల తరువాత సాధించిన తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే కేసీఆర్ నాయకత్వంలో ప్రగతి పథంలో పయనిస్తుందని సంబురపడ్డారు. శిబూ సొరేన్తో కేసీఆర్‌కు ఉద్యమ బంధం పెనవేసుకున్నది. రాష్ట్ర సాధన అనంతరం శిబూ సొరేన్‌ను కేసీఆర్ ఆహ్వానించటమే కాకుండా 2022లో జార్ఖండ్‌కు వెళ్లి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. దేశ సమాఖ్య స్ఫూర్తి, ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించిన బలమైన గొంతుక శిబూ సొరేన్ అస్తమయంతో తెలంగాణ సమాజంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తేతెలంగాణ): జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబూ సొరేన్ మరణం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. గిరిజనుల హక్కులు, జార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడని శ్లాఘించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ శిబూసోరేన్ మృతికి సంతాపం తెలిపారు.