డెహ్రాడూన్, జూలై 9: కేవలం రెండు నెలల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాడిలో మరణించిన ఉత్తరాఖండ్‌కు చెందిన సైనికుడు ఆదర్శ్ నేగి కుటుంబానికి ఎదురైన విషాదకర పరిస్థితి ఇది. విధి నిర్వహణలో తమ బిడ్డలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని గర్వంగా ఉన్నప్పటికీ, మరోవైపు కడుపు కోత తల్లిదండ్రుల కండ్ల నుంచి దుఃఖాన్ని ఆపనీయడం లేదు.
రెండు నెలల్లో ఇద్దరిని కోల్పోడంతో ఆ కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని తేహ్రి జిల్లాకు చెందిన 26 ఏండ్ల జవాన్ ఆదర్శ్ నేగి.. సోమవారం జరిగిన ఉగ్రదాడిలో మరణించారు. అంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్ 30న లేహ్‌లో ఆదర్శ్ నేగి పెద్దనాన్న కుమారుడు 33 ఏండ్ల మేజర్ ప్రణయ్ నేగి మరణించారు. ఆదర్శ్ నేగి పెద్దనాన్న బల్వంత్ సింగ్ మాట్లాడుతూ రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు కుమారులను పోగొట్టుకొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదర్శ్ నేగి 2018లో గర్హాల్ రైఫిల్స్‌లో చేరారు. ఆదర్శ్ నేగి తండ్రి ఓ రైతు. తల్లి, ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. ఆర్మీలో ఉద్యోగం సాధించిన అతను.. దేశం కోసం ప్రాణాలు అర్పించాడని బల్వంత్ సింగ్ గర్వంగా చెప్పాడు. దేశానికి సేవ చేయాలని వెళ్లిన తమ బిడ్డలు.. మృతదేహాలుగా ఇంటికి వచ్చారని, ఇది కుటుంబాన్ని దుఖః సాగరంలో ముంచిందని అన్నారు.