న్యూఢిల్లీ: యూనివర్శిటీ క్యాంపస్‌లో కశ్మీరీ విద్యార్థిపై దాడి జరిగింది. దీంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థిపై దాడి సంఘటనను ఖండించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ క్యాంపస్‌లో కశ్మీరీ మహిళా విద్యార్థినిపై మెస్ వర్కర్ దాడి చేశాడు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఎంఏ రెండో ఏడాది చదువుతున్న 24 ఏళ్ల కశ్మీరీ లేడీ స్టూడెంట్ను 22 ఏళ్ల మెస్ వర్కర్ అబిద్ కొట్టాడు.
కాగా, జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలోని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఇది తీవ్రమైన భద్రతా లోపమని పేర్కొంది. జమ్ముకశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు మద్దతు, అధికారులతో అనుసంధానం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు మెస్ వర్కర్ అబిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కశ్మీరీ మహిళా విద్యార్థిని ఫిర్యాదు ఆధారంగా అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. అయితే జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సంఘటన జరుగలేదని చెప్పారు. కేవలం వ్యక్తిగత వివాదం వల్ల కశ్మీర్ విద్యార్థినిపై దాడి జరిగిందని వెల్లడించారు.