జమ్ము, నవంబర్ 21: జమ్ము నగరంలో కశ్మీర్ పండిట్లకు చెందిన 12 దుకాణాలను జమ్ము డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి మందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విపక్ష పార్టీలు పలుచోట్ల నిరసనలు వ్యక్తం చేశాయి. ముతీ కేంప్ ప్రాంతంలో మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ పండిట్లు నిర్మించిన ఈ దుకాణాలను అధికారులు బుధవారం కూల్చివేశారు. వారు దుకాణాలు నిర్మించిన స్థలం జమ్ము డెవలప్మెంట్ అథారిటీ (జేడీఏ)కి చెందినదని అధికారుల వాదన. కాగా, కూల్చివేసిన దుకాణాలను రిలీఫ్ కమిషనర్ అరవింద్ కుమార్ కర్వానీ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కూల్చివేతల కారణంగా నష్టపోయిన కుటుంబాల వారికి అదే ప్రాంతంలో దుకాణాలను నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. కాగా, జేడీఏ చర్యలను బీజేపీ, పీడీపీ, ఆప్నీ పార్టీ, కశ్మీర్ పండిట్ సంస్థలు తీవ్రంగా నిరసించాయి. వారికి కొత్త షాపులు నిర్మించి ఇవ్వాలని, బాధితులకు జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశాయి.