న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ్ ధామ్‌ను, కారిడార్ అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కారి డార్‌ను జాతికి అంకితమిస్తున్నట్టు వెల్లడించారు. కాశీలోకి ప్రవేశించిన వెంటనే ఏ వ్యక్తి అయినా అన్ని బంధనాల నుంచి విముక్తి అవుతాడన్నారు. అతని అంతరాత్మ జాగృతం అవుతుందని పేర్కొన్నారు. కాశీలో మృత్యువు కూడా మంగళమేనన్నారు. విశ్వనాథ్ ధామ్ ప్రారంభంతో కాశీలో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. వందల ఏండ్లుగా కొనసాగిన బానిసత్వం వల్ల ఏర్పడ్డ ఆత్మన్యూనతా భావం నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నదన్నారు. ఎంతో మంది ఆక్రమణదారులు భారత సాంస్కృతిక వారసత్వాన్ని ధ్వంసం చేయడానికి విఫలయత్నం చేశారని పేర్కొన్నారు. ప్రారంభానికి ముందు మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించారు. అక్కడి నుంచి విశ్వనాథ్ ఆలయానికి వచ్చారు. కాశీ సుందరీకరణ, ఆలయ అభివృద్ధిలో భాగంగా గుడి పరిసరాలను 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించారు. రూ.339 కోట్లతో కాశీ విశ్వనాథుని ఆలయాన్ని గంగా నదిని కలుపుతూ కారిడార్ ఏర్పాటు చేశారు.
సనాతన సంస్కృతికి ప్రతీక
కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడారు. ఔరంగజేబు, సలార్ మసూద్, బ్రిటిష్ గవర్నర్ వారన్ హేస్టింగ్స్ మట్టిలో కలిసిపోయారని, బెనారస్ మాత్రం తన వైభవాన్ని నిలుపుకొని నిలబడిందన్నారు. ‘ఔరంగజేబు సాగించిన అకృత్యాలకు కాశీ నగరమే సాక్షి. కానీ ఈ దేశం మట్టి మిగతా ప్రపంచం కంటే భిన్నమైంది. ఔరంగజేబు రాగానే, శివాజీ అవతరించాడు. సలార్ మసూద్ రాగానే రాజా సుహేల్ దేవ్ వచ్చాడు’ అని చెప్పారు. కాగా, యూపీలో బీజేపీ సర్కారు చివరి దశలో ఉండ డంతోనే మోదీ వారణాసి వచ్చారని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. మరోవైపు, గంగా నది ఏమైందని విపక్షాలు ప్రశ్నించాయి.