బెంగళూరు: దొంగతనం, ఇనుప ఖనిజం అక్రమ రవాణా కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సెయిల్, మరో ఆరుగురికి ప్రత్యేక కోర్టు ఏడేండ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. న్యాయస్థానం జైలు శిక్ష విధించినందున సతీశ్‌ను వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని అసెంబ్లీ స్పీకర్‌కు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కార్వార్ శాసనసభ్యుడిగా ఉన్న సతీశ్ కృష్ణ శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా చోరీ, మోసం, నేరపూరిత కుట్రలకు పాల్పడినట్టు మోపిన అభియోగాలు రుజువు కావడంతో ఆయనతో పాటు మరో ఆరుగురికి జైలు శిక్ష, రూ.6 కోట్ల జరిమానా విధిస్తూ న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పింది.