Karur Stampede | తమిళనాడు కరూర్‌లో టీవీకే ర్యాలీలో శనివారం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పార్టీ చీఫ్, నటుడు దళపతి విజయ్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా రావడమే కారణమని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో వచ్చాయి. జాతీయ మీడియా కథనం ప్రకారం.. శనివారం కరూర్‌లో జరిగిన రోడ్ షోకు ఆలస్యంగా వచ్చారని.. ఆయన అనుమతి లేకుండా అనేక చోట్ల ర్యాలీలు నిర్వహించినట్లుగా ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు.
ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారని.. గందరగోళానికి దారి తీసిందన్నారు. ఈ విషయంలో పోలీసులు హెచ్చరించినా పార్టీ అధికారులు వాటిని పట్టించుకోలేదని తెలిపారు. కార్యకర్తలు పైకప్పులు, చెట్ల కొమ్మలపై కూర్చున్నారని ఎఫ్ఐఆర్లో పోలీసులు ప్రస్తావించారు. అకస్మాత్తుగా జనం కుప్పకూలిపోయారని.. చాలామంది ఊపిరాడక మరణించినట్లు తెలిపారు. కరూర్ జిల్లా కార్యదర్శి మథియలగన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాసి ఎన్ ఆనంద్, జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్లపై భారత శిక్షాస్మృతిలోని 105, 110, 125, 223 తమిళనాడు ప్రజా ఆస్తి చట్టంలోని సెక్షన్ 3 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయ్ తన రాజకీయ శక్తిని ప్రదర్శించేందుకు.. పెద్ద సంఖ్యలో జనాలను రప్పించేందుకు నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చారని.. జనం వేడి, దాహం, నీటి కొరతతో పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొన్నారు.
కరూర్ తొక్కిసలాటకు సంబంధించి పుకార్లు వ్యాప్తి చేసినందుకు తమిళనాడు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పెరుంబాక్కంకు చెందిన సహాయం (38), మంగడుకు చెందిన శివనేశ్వరన్ (టీవీకే సభ్యుడు), టీవీకే 46వ వార్డు కార్యదర్శి అవడికి చెందిన శరత్‌కుమార్ (32) ఉన్నారు. ఈ వ్యక్తులు సోషల్ మీడియాలో, స్థానికంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.