Actor Vijay : కరూర్ (Karur) లో తొక్కిసలాట (Stampede) ఘటనపై ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు (TVK chief) విజయ్ (Vijay) స్పందించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. తన హృదయం ముక్కలైందని, తాను భరించలేని బాధలో, దుఃఖంలో ఉన్నానని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
‘నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నా. ఆ బాధ పదాల్లో వర్ణించలేనిది. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని విజయ్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
కాగా తమిళనాడులోని కరూర్ పట్టణంలో ఆదివారం రాత్రి విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. అందులో 39 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. విజయ్ ప్రసంగిస్తుండగా కొందరు ఒక్కసారిగా ఆయనకు సమీపానికి వచ్చేందుకు ప్రయత్నించారు. దాంతో తొక్కిసలాట జరిగింది.
షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం రావాల్సిన విజయ్.. ఆరు గంటలు ఆలస్యంగా కరూర్‌కు చేరుకోవడం, ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు ర్యాలీలో పాల్గొనడమే తొక్కిసలాటకు కారణాలుగా తెలుస్తోంది. తొక్కిసలాటపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.