Karur stampede : కరూర్ తొక్కిసలాట ఘటనలో తీవ్ర అస్వస్థకు గురైన ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. దాంతో ఇప్పటివరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 41కి పెరిగింది. కరూర్ జిల్లాకు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు సుగుణ (Suguna).. శనివారం రాత్రి నటుడు విజయ్ (Actor Vijay) ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) లో కిందపడి తీవ్ర అస్వస్థతకు గురైంది. అప్పటి నుంచి ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయింది.
ఇప్పటివరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 41కి చేరగా.. వారిలో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారు. ఆ 10 మంది చిన్నారుల్లో ఐదుగురు బాలురు కాగా.. మరో ఐదుగురు బాలికలు. మృతుల్లో 34 మంది కరూర్ జిల్లాకే చెందిన వారు కాగా.. ఈరోడ్, తిరుప్పూర్, దిండిగల్ జిల్లాలకు చెందిన వారు ఇద్దరేసి ఉన్నారు. మరొకరు సాలెం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. ఓ 28 ఏళ్ల మహిళ, తన ఇద్దరు పదేళ్లలోపు కుమార్తెలు కూడా ఈ ఘటనలో మరణించారు. అక్టోబర్‌లో పెళ్లి కోసం నిశ్చితార్థం జరిగిన 24 ఏళ్ల యువకుడు, 24 ఏళ్ల యువతి కూడా ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.