బెళగావి (కర్ణాటక), డిసెంబర్ 11: కర్ణాటకలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఓ మహిళను నగ్నంగా ఊరేగించి, కరెంటు స్తంభానికి కట్టేశారు. బెళగావి జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కలిసి అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం అబ్బాయి తల్లిని రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి, ఊరేగించారు. తర్వాత కరెంటు స్తంభానికి కట్టేశారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సదురు మహిళను దవాఖానకు తరలించారు. దాడికి పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేశారు. ఘటనపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ ‘అత్యంత అమానుషం.. నిందితులను అరెస్టు చేశాం. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.