Karnataka | బెంగళూరు, మార్చి 1: కర్ణాటకలో రాజకీయ భూకంపం రాబోతున్నదని, త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు ఉంటాయని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు బీ శ్రీరాములు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక త్వరలో ఒక ఏక్నాథ్ షిండే ఉదంతాన్ని చూడబోతున్నదని అన్నారు.
ఒకవేళ అదే గనుక జరిగితే..కాంగ్రెస్ చీలిక వర్గానికి మద్దతు ఇవ్వాలా? లేదా? అన్నది బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. కోయంబత్తూరులో జరిగిన ఇషా ఫౌండేషన్ మహా శివరాత్రి ఉత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డీకే శివకుమార్ హాజరు కావటం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. డీకే శివకుమార్ బీజేపీకి దగ్గరవుతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
‘అధికార కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే నాయకులు చాలామంది ఉన్నారు. అందులో డీకే శివకుమార్ ఒకరు’ అని బీజేపీ శాసనసభ పక్ష నేత ఆర్ అశోక్ అన్నారు. బీజేపీతో చేతులు కలిపి, కాంగ్రెస్ సర్కార్ను కూల్చివేసే నాయకుడు డీకే శివకుమార్ కావొచ్చునని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తనపై వస్తున్న ఊహాగానాల్ని డీకే శివకుమార్ ఖండించి, ఇదంతా బీజేపీ ప్రచారంగా కొట్టిపారేశారు.