బెంగళూరు: కర్ణాటకలో ఒక వైపు హిందూ, ముస్లింల మధ్య పలు వివాదాలు చెలరేగుతున్నాయి. హిజాబ్, హలాల్ వంటి అంశాలు ఆ రాష్ట్రంతోపాటు దేశాన్ని కుదిపేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం ఖురాన్ పఠనంతో ఆలయ ఉత్సవం, రథోత్సవం ప్రారంభమైంది. హాసన్ జిల్లా బేలూరు తాలూకాలోని ప్రసిద్ధ చెన్నకేశవ దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలో హొయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించారు. 1116లో చోళులపై సాధించిన విజయాలకు గుర్తుగా ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. విజయ నారాయణగా నామకరణం చేసిన ఈ ఆలయం దేశ, విదేశాలకు చెందిన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కాగా, కరోనా నేపథ్యంలో గత రెండు ఏండ్లగా ఆలయ ఉత్సవం, రథోత్సవాన్ని నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి చాలా అట్టహాసంగా చెన్నకేశవ రథోత్సవం బుధవారం ప్రారంభమైంది. దీనికి ముందు ముస్లిం మత పెద్ద కాజీ సయ్యద్ సాజీద్ పాషా సంప్రదాయంగా ఖురాన్‌ను పఠించారు. ఈ సంప్రదాయాన్ని విడనాడాలని కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు హిందూ అతివాద సంఘాలు పలు ప్రచారాలు చేపట్టాయి. అయినప్పటికీ ఏళ్లనాటి సంప్రదాయాన్ని యథావిధిగా కొనసాగించారు.