బెంగళూరు: తక్షణమే తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ఏడుగురు రాష్ట్ర మంత్రులకు లేఖ రాసింది. పెండింగ్ బిల్లులు రూ.32 వేల కోట్లకు చేరుకున్నాయని, సీనియారిటీ ప్రకారం బిల్లుల చెల్లింపు జరగడం లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు ప్రియాంక్ ఖర్గే, హెచ్‌సి మహదేవప్ప, జమీర్ అహ్మద్ ఖాన్, ఎన్ఎస్ బోసరాజు, దినేష్ గుండూరావు, రహీం ఖాన్‌లను ఉద్దేశించి రాసిన లేఖలో సంఘం ఆరోపించింది.
పెండింగ్ బిల్లులలో రూ.14,000 కోట్లు నీటి పారుదల శాఖకు చెందినవే ఉన్నాయని తెలిపింది. వారం రోజుల్లో బకాయిలు చెల్లించకపోతే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లడమేగాక పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సంఘం హెచ్చరించింది. కమీషన్లు ముట్టచెప్పిన తర్వాతే కాంట్రాక్టులు మంజూరవుతున్నాయని సంఘం తాత్కాలిక అధ్యక్షుడు జగన్నాథ్ షెగ్జీ ఆరోపించారు. మంత్రుల కన్నా ఎమ్మెల్యేలే కాంట్రాక్టు పనులలో ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.