Karnataka | బెంగళూరు, డిసెంబర్ 18 : కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీలను దివాలా తీయిస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించిన ఆర్టీసీలకు చెల్లించాల్సిన డబ్బులను సిద్ధరామయ్య సర్కారు సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో ఆర్టీసీలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్నాయి. బస్సుల నిర్వహణ, సిబ్బందికి వేతనాలు ఇవ్వడమూ ఆర్టీసీలకు కష్టంగా మారుతున్నది. ఆర్టీసీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారెంటీల్లో శక్తి పథకం(మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) ప్రధానమైనది. 2023 జూన్ 11న ఈ పథకాన్ని ప్రారంభించింది.
మహిళల టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీలకు చెల్లించాలి. కానీ, 2023-24కు సంబంధించి రూ.1,180.62 కోట్లు ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి రూ.579.19 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. శక్తి పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో చాలీచాలని నిధులు కేటాయిస్తున్నది. అవీ సక్రమంగా విడుదల చేయకపోవడంతో ఆర్టీసీలకు బకాయిలు పేరుకుపోతున్నాయి. దీంతో ఆర్టీసీలు దివాలా తీసే పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. కాగా, కొత్త బస్సులకు ఇచ్చే పన్ను రాయితీలను శక్తి పథకం బకాయిల కింద ముడిపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రాయితీలకు, బకాయిలకు ముడిపెట్టొద్దని, బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా వ్యయానికి తగ్గట్టుగా నిధులు ఇవ్వాలని ఆర్టీసీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. కాగా, ఆర్టీసీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 31 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ఆర్టీసీల కార్మికుల జేఏసీ ప్రకటించింది.