బెంగళూరు, సెప్టెంబర్ 13: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. తమ ఎరియర్స్ చెల్లింపులతో పాటు, ఇతర డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 27 నుంచి ఆందోళనకు దిగుతామని ఆరు యూనియన్లతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. తమ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ)కి చెందిన నాలుగు యూనియున్లు ఫ్రీడమ్ పార్కులో ధర్నా నిర్వహించాయి.
అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎం సిద్ధరామయ్యకు అందజేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.4,565 కోట్లు, శక్తి స్కీమ్ కింద రీయింబర్స్ చేయాల్సిన 1,346 కోట్లు, వేతన బకాయిలు, తదితరాలు 998 కోట్లు చెల్లించాలని, వేతన సవరణ కమిటీని వెంటనే వేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఈ నెల 26లోగా వీటిపై చర్య తీసుకోవాలని, లేకపోతే సెప్టెంబర్ 27 నుంచి నిరవధికంగా సమ్మెలోకి దిగుతామని హెచ్చరించింది.