బెంగళూరు, మార్చి 27 : మొన్న ఆర్టీసీ, నిన్న మెట్రో, పవర్ చార్జీలు.. ఇప్పుడు పాల ధరలు.. వరుస చార్జీల బాదుడుతో కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. గ్యారెంటీల అమలు సంగతి దేవుడెరుగు.. ఏ రోజు ఏ చార్జీలు పెంచుతారేమోనని ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా పాలపై లీటరుకు ఏకంగా రూ.4 పెంచుతున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. సిద్ధరామయ్య నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం పాల ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని మంత్రి కేఎన్ రాజన్న తెలిపారు. ఏడాది తిరగకుండానే పాల ధరలు పెంచడం ఇది రెండోసారి.
పాల సమాఖ్యలు, రైతుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ధరను పెంచక తప్పలేదని మంత్రి రాజన్న మీడియాకు చెప్పారు. వారు లీటరుకు రూ.5 పెంచాలని కోరగా, ప్రభుత్వం రూ.4 పెంచిందని, పెంచిన మొత్తమంతా రైతులకే వెళ్తుందని ఆయన చెప్పారు. నందిని బ్రాండ్ పేరుతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) తన ఉత్పత్తులను అమ్ముతున్నది. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో, బస్సు, మెట్రో, కరెంట్ చార్జీలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉగాదికి ముందు పాల ధరను కూడా పెంచడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. పాల ధర పెంపుతో టీ, కాఫీ, స్వీట్లు, హోటళ్లలోని ఇతర పాల ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ఈ ధరల పెంపుతో ఇప్పటివరకు రూ.44కు లభిస్తున్న నందిని లీటర్ పాల ప్యాకెట్ రూ.48 అవుతుంది. కర్ణాటక ప్రభుత్వం 2024 జూన్లో పాల ధరను లీటర్కు రూ.2 పెంచింది.