DK Shivakumar | బెళగావిలో కర్నాటక శాసనసభ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మారోసారి కర్నాటకలో సీఎం మార్పు ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. సమావేశాల తర్వాత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ప్రకటించారు. విందు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బేలాలోని ఆ పార్టీకి చెందిన ప్రవీణ్ ఫామ్ హౌస్‌లో గురువారం రాత్రి విందు జరిగిది. ఈ విందులో దాదాపు 50 నుంచి 55 మంది ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు ఈ విందుకు హాజరైనట్లుగా సమాచారం. ఈ సమావేశంలో ఇక్బాల్ హుస్సేన్ సీఎం మార్పుపై వ్యాఖ్యలు చేడంతో మరోసారి కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విందులో ఇక్బాల్ మాట్లాడుతూ ‘మీకు నేను శుభవార్త చెబుతున్నాను. సమావేశాల తర్వాత డీకే శివకుమార్ సీఎం అవుతారు’ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ శివకుమార్‌కు అవకాశం లభిస్తుందని.. ఆయన సీఎం అవుతారన్నారు.
అందులో తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు. ఆయన పోరాటం, కృషి ఫలిస్తుందన్న నమ్మకం అందరికీ ఉందన్నారు. విందు బల ప్రదర్శన కాదని.. ఎమ్మెల్యేల సాధారణ సమావేశమన్నారు. అందరం స్నేహితులమని.. అందరు కలిసి భోజనం చేయడం బల ప్రదర్శన కాదన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల విందు రాజకీయాలు కర్నాటకలో ఊపందుకున్నాయి. గత కొన్ని రోజులుగా కిందట సీఎం సిద్ధరామయ్య డీకే శివకుమార్‌కు తన ఇంట్లో అల్పాహార విందు ఇచ్చారు. అనంతరం డీకే శివకుమార్ సైతం సీఎంను తన ఇంటికి అల్పాహారానికి ఆహ్వానించారు. తాజాగా ఎమ్మెల్యేలు విందులో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ముఖ్యమంత్రి మార్పుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంగీకరించినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సమావేశాలు జరుగుతుండగా.. విందు రాజకీయాలు జోరందుకున్నాయి.