D Sudhakar : కర్ణాటకలో విషాదం జరిగింది. కాంగ్రెస్ నేత, కర్ణాటక ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మంత్రి డీ సుధాకర్ (66) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని క్రిష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతూ ఆదివారం వేకువ ఝామున తుదిశ్వాస విడిచారు. రెండు నెలలుగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
ఆయన ముందుగా మోకీలు ఆపరేషన్ కోసం ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్బంగా ఆయనకు లంగ్ సమస్య ఉన్నట్లు గుర్తించి, చికిత్స అందించారు. సుధాకర్ కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్. ఆయన చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుధాకర్ మరణంపై కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ స్పందించారు. సుధాకర్ ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అలాగే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా సుధాకర్ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. సుధాకర్ మృతితో రాష్ట్రం ఒక గొప్ప పరిపాలకుడిని కోల్పోయిందని సిద్ధరామయ్య అన్నారు.
ఆయన తన మంత్రివర్గంలో రెండుసార్లు పని చేశారని గుర్తు చేశారు. అలాగే, సుధాకర్ మరణంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. తమ క్యాబినెట్ మినిస్టర్ అయిన సుధాకర్ మరణం తననెంతో కలచివేసిందన్నారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.