బెంగళూరు, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తాజా ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అది ఎంతలా ఉందంటే, ఏకంగా 12 మంది మంత్రులు పరాజయం చవి చూశారు. వరుణ, చామరాజనగర స్థానాల్లో పోటీ చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమణ్ణ రెండు చోట్లా ఓడిపోయారు. రవాణా శాఖ మంత్రి బి.శ్రీరాములు బళ్లారి నియోజక వర్గంలో 29,300 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్‌ను చిక్కబళ్లాపుర ప్రజలు ఇంటికి సాగనంపారు. చిక్కనాయకన హళ్లిలో న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి జేడీ(ఎస్) అభ్యర్థి సీబీ సురేశ్ చేతిలో ఓటమి చవి చూశారు. ఇతర మంత్రులు గోవింద్ కార్జోల్, ఎంటీబీ నాగరాజ్, కేసీ నారాయణ, మురుగేశ్ నిరాణి, హాలప్ప ఆచార్, బీసీ పాటిల్ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. శాసస సభాపతి విశ్వేశ్వర్ హెగ్డే శిర్సి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజితులయ్యారు.