బెంగళూర్ : కర్నాటకలో సాగుతున్న బైబిల్ వివాదానికి సంబంధించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. స్కూల్ సిలబస్‌లో భగవద్గీతను జోడిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాటు క్లారెన్స్ హైస్కూల్ ఇటీవల విద్యార్ధులను క్లాస్‌రూంలోకి బైబిల్ తీసుకురావాలని కోరడం నేపధ్యంలో మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత, బైబిల్‌ను కలపవద్దని కోరారు. భగవద్గీత మత గ్రంధం కాదని, మతాచారాల గురించి ఇది మాట్లాడదని చెప్పారు.
భగవద్గీత ప్రార్ధనలు ఎలా చేయాలో చెప్పదని అన్నారు. భగవద్గీత అన్నింటికీ మించినదని, విద్యార్ధుల నైతిక స్ధైర్యం పెంచే నైతిక శాస్త్రాన్ని సిలబస్‌లో చేర్చేందుకు తాము సిద్ధమని మంత్రి స్పస్టం చేశారు. బైబిల్‌ను బోధించడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న బెంగళూర్‌కు చెందిన క్లారెన్స్ హైస్కూల్‌కు కర్నాటక ప్రభుత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసిన నేపధ్యంలో మంత్రి నగేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్లారెన్స్ స్కూల్‌కు ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ విభాగం మంగళవారం నోటీసులు జారీ చేసింది.
షోకాజ్ నోటీసుకు స్కూల్ యాజమాన్యం సమాధానం ఇచ్చిన అనంతరం స్కూల్‌పై ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని మంత్రి నగేష్ పేర్కొన్నారు. కాగా స్కూల్‌కు తమ పిల్లలు బైబిల్‌ను తీసుకురావడం పట్ల తమకు అభ్యంతరం లేదని పేర్కొంటూ విద్యార్ధుల తల్లితండ్రులు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఏప్రిల్ 25న క్లారెన్స్ హైస్కూల్ కోరడంతో కర్నాటకలో బైబిల్ వివాదం మొదలైంది. ఇక స్కూల్లో చదివే క్రైస్తవేతర విద్యార్ధులను కూడా బైబిల్ చదవాలని ఒత్తిడి చేస్తున్నారని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.