థాణె, జూలై 14: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గేకు సన్నిహితుడిగా భావిస్తున్న కాంగ్రెస్ నేత లింగరాజు కన్నీని మాదక ద్రవ్యాల రవాణా కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. కలబురిగి దక్షిణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న లింగరాజును అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద 120 నిషేధిత కోడైన్ సిరప్ బాటిళ్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా లింగరాజు.. మంత్రి ఖర్గేతో వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. నిందితుడిపై నార్కోటిక్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు కళ్యాణ్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో కలబురిగి రీజియన్‌లో మాదకద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని అరికడతానని ప్రియాంక్ ఖర్గే ప్రతిజ్ఞ చేసిన క్రమంలో ఆయన సన్నిహితుడిగా భావిస్తున్న వ్యక్తే ఇలా డ్రగ్స్ స్మగ్లింగ్‌లో చిక్కడంతో రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.