Karnataka : కర్ణాటకలో అధికారం మారబోతున్న సంగతి తెలిసిందే. సీఎం పదవి నుంచి సిద్దరామయ్య తప్పుకోవడం దాదాపు ఖాయమైంది. ఆయన స్థానంలో డీకే శివకుమార్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపడుతారు. ఇదే సమయంలో మంత్రివర్గంలో కూడా భారీ మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం, మే 28న సిద్ధరామయ్య రాజీనామా చేస్తారు. మే 30న డీకే శివకుమార్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది.
సీఎంగా డీకేతోపాటు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. ఇదే సమయంలో ముగ్గురిని డిప్యూటీ సీఎంలుగా తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించిందని విశ్వసనీయ సమాచారం. ఒక ఎస్సీ అభ్యర్థి, ఒక ఓబీసీ అభ్యర్థి, ఒక మహిళకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తారు. అలాగే, ఒక మైనారిటీకి కూడా డీసీఎంగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పదవుల విషయంలో ప్రస్తుతం కొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జి.పరమేశ్వర లేదా ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ), యతీంద్ర సిద్ధరామయ్య (ఓబీసీ), ఎంబీ పాటిల్ లేదా ఈశ్వర్ ఖండ్రే (లింగాయత్), కేజీ జార్జ్ లేదా యూటీ ఖాదర్ లేదా జమీర్ అహ్మద్ ఖాన్ (మైనారిటీ) పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. తాజా పరిణామాలకు సంబంధించి సీఎం పదవి నుంచి తప్పుకోవాలి అని కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు సూచించింది.
ఆయనకు రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆయన తనయుడికి డీసీఎం పదవి లేదా మంత్రివర్గంలో చోటు దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిద్ధరామయ్య గురువారం గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ఆయనను కలిసి తన రాజీనామా సమర్పిస్తారు. శనివారం కర్ణాటకలో డీకే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే, అధికారం మార్పు గురించి కాంగ్రెస్ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.