న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్ తలెత్తవచ్చనే ఆందోళనల నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఆగస్ట్ 15 తర్వాత వైరస్ కట్టడికి కఠిన నియంత్రణలను అమలు చేయనుంది. రాష్ట్రంలో కొవిడ్-19 పరిస్ధితిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేశారని రెవెన్యూ మంత్రి ఆర్ .అశోక్ వెల్లడించారు. కర్నాటక ప్రభుత్వం ఆగస్ట్ 25 నుంచి స్కూల్స్ పునఃప్రారంభమవుతాయని ప్రకటించినా థర్డ్ వేవ్ తలెత్తవచ్చనే అంచనాతో సీఎం నిపుణులతో అత్యవసర భేటీని ఏర్పాటు చేయడం గమనార్హం.
చిన్నారులు వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో థర్డ్ వేవ్ వారిపై ప్రభావం చూపుతుందని బొమ్మై ఇప్పటికే హెచ్చరించారు. చిన్నారులపై మహమ్మారి ప్రభావాన్ని మందింపు చేసేందుకు తాము ఉడిపి, హవేరి జిల్లాల్లో వాత్సల్య పధకాన్ని చేపట్టామని సీఎం తెలిపారు. పిల్లల్లో పోషకాహార లోపాలను నివారించేందుకు ఆయా జిల్లాల్లో పీడియాట్రిక్ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు జిల్లా ఆస్పత్రులన్నింటిలో పీడియాట్రిక్ ఐసీయూలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆగస్ట్ 1 నుంచి 11 వరకూ 543 మంది చిన్నారులకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.