IT Employees | బెంగళూరు, మార్చి 10: అధిక పనిగంటలపై బెంగళూరు టెకీలు నిరసనకు దిగారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ దిష్టి బొమ్మలను దహనం చేసేందుకు వారు ప్రయత్నించగా బెంగళూరు పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. ఐటీ రంగంలో దోపిడీ పని విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన జరిగింది.
ఇటువంటి పని విధానాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో టెకీలు రోడ్లపైన గుమికూడి వారానికి 70-90 పని గంటలను ప్రతిపాదించిన ఈ ఇద్దరు ఐటీ వ్యాపారవేత్తల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు యత్నించారు. నగరంలోని ఫ్రీడమ్ పార్క్ వద్ద కూడా ఆదివారం ఇటువంటి ప్రదర్శనే జరిగింది.
ఆరోగ్యవంతమైన పని-జీవన సమతుల్యత ప్రతి ఉద్యోగి హక్కు అనే నినాదంతో టెకీలు తమ నిరసన తెలియచేశారు. ఐటీ/ఐటీఈఎస్/బీపీఓ రంగానికి చెందిన ఉద్యోగుల పని గంటలను పొడిగించాలని కోరుతూ ఐటీ కంపెనీలు కర్ణాటక ప్రభుత్వానికి అందచేసిన ప్రతిపాదనను నిరుడు జూలైలో కేఐటీయూ తీవ్రంగా ఖండించింది.
ఉద్యోగుల పని గంటలను 8 నుంచి 14 గంటలకు పెంచాలని కంపెనీలు కోరాయి. ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ ప్రతిపాదనను ఆమోదించవద్దని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కేఐటీయూ కోరింది.