Karnataka | బెంగళూరు, ఏప్రిల్ 9: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి పెచ్చుమీరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి సొంత ప్రభుత్వంపై బాంబు పేల్చారు. సిద్ధరామయ్య ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్ అవినీతి ప్రభుత్వమంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా అయిన రాయరెడ్డి ఈ స్థాయిలో ఆరోపణలు చేయడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలన్న డిమాండు ఉధృతమైంది.
కొప్పల్‌లో మంగళవారం జరిగిన ప్రాంతీయ అసమానత పరిష్కార కమిటీ సమావేశంలో రాయరెడ్డి ప్రసంగిస్తూ అవినీతిలో కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్‌గా మారిందని కుండబద్దలు కొట్టారు. కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అవినీతి మాత్రం కార్చిచ్చులా రగులుతోంది. అవినీతి విషయానికి వస్తే కర్ణాటక దేశంలోనే నంబర్ వన్ అని ఆరోపించారు.
రాష్ట్రంలో పెచ్చరిల్లిన అవినీతి కారణంగా ప్రభుత్వ మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు నాసిరకంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వ భవనాలు ఐదారు దశాబ్దాల పాటు దృఢంగా ఉండేవని, ఇప్పుడు పట్టుమని పదేళ్లకే కుప్పకూలుతున్నాయని విమర్శించారు. అవినీతి కారణంగానే నిర్మాణ ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కళ్యాణ కర్ణాటకలో మితిమీరిన అవినీతి ఉందని రాయరెడ్డి చెప్పారు.
సొంత ప్రభుత్వంపై రాయరెడ్డి చేసిన ఆరోపణలు ప్రతిపక్ష బీజేపీకి అస్త్రంగా మారాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకుడు సుధా హల్కి డిమాండు చేశారు. ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు తన మనసులో మాట చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న భారీ స్థాయి అవినీతిని ఆయన బట్టబయలు చేశారు.
ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అని హల్కి డిమాండు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో అవినీతి, లూటీలు వేళ్లూనుకు పోయాయని, బసవరాజ్ రాయరెడ్డి వ్యాఖ్యలు ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేయడంతోపాటు రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చాయని ఆయన తెలిపారు. రాయరెడ్డి వెల్లడించిన వాస్తవాలతో ప్రపంచ వేదికపై రాష్ట్ర ప్రతిష్ట నాశనమైందని మండిపడ్డారు.
సిద్ధరామయ్య ప్రభుత్వ అవినీతిపై గతంలో కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో అవినీతికి, ఆర్థిక అక్రమాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అర్థవంతమైన పెట్టుబడులను విస్మరించి ఉచితాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న కర్ణాటకను సిద్ధరామయ్య రెవెన్యూ లోటు రాష్ట్రంగా మార్చారని ఆయన విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రూ.22,000 కోట్ల రెవెన్యూ మిగులుతో అధికారాన్ని అప్పగించగా సిద్ధరామయ్య రూ.4,000 కోట్ల రెవెన్యూ లోటుకు రాష్ర్టాన్ని మార్చారని మోహన్‌దాస్ విమర్శించారు. ఈ ఏడాది మరో 27,000 కోట్ల లోటును తెచ్చారని, ఉచితాలపై నిధులు ఖర్చు పెడుతుంటే అభివృద్ధి ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మోహన్‌దాస్ విమర్శలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి.