బెంగళూరు: కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర హైకోర్టు (Karnataka High Court) షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయిస్తూ తీసుకున్న కేబినెట్ నిర్ణయంపై స్టే విధించింది. కోట్లలో విలువైన కీలక భూమిని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం తక్కువ ధరకే కేటాయించడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలతోపాటు న్యాయపరమైన సవాళ్లకు దారితీసింది. హుబ్బల్లి- ధార్వాడ్లోని కేశ్వాపూర్ సర్కిల్ సమీపంలో 2,988.29 చదరపు మీటర్ల స్థలాన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నిర్మాణం కోసం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సీఎం సిద్ధ రామయ్య ప్రభుత్వం కేటాయించింది. గత ఫిబ్రవరిలో కర్ణాటక మంత్రివర్గం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
కాగా, సుమారు రూ. 5.67 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 28 లక్షలకే కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్థలంలో ప్రస్తుతం హుబ్బల్లి నగరానికి తాగునీటిని సరఫరా చేసే పెద్ద నీటి నిల్వ ట్యాంకులు ఉన్నాయి. అలాగే ప్రజల కోసం పరిమితం చేసిన ప్రాంతంలోని స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించడంపై వ్యతిరేకత వ్యక్తమైంది.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హుబ్బల్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్లోని బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన భూమిని రాజకీయ పార్టీకి కేటాయించడం సరికాదని వాదించారు. బీజేపీ సభ్యులు సంతోష్ చవాన్, బీరప్ప ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఈ అంశం హైకోర్టుకు చేరడంతో కేబినెట్ నిర్ణయంపై స్టే విధించింది.