బెంగళూరు, జూన్ 14: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్పకు తాత్కాలిక ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చేయడం లాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా నిలిపివేసిన కర్ణాటక హైకోర్టు, యెడియూరప్ప దర్యాప్తు సంస్థ అధికారి ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
17 ఏండ్ల బాలికను వేధించిన పోక్సో కేసులో దర్యాప్తు సంస్థ సీఐడీ విజ్ఞప్తి మేరకు యెడియూరప్పపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అయితే తాను జూన్ 17న పోలీసుల ఎదుట హాజరవుతానంటూ యెడియూరప్ప పోలీసులకు లేఖ పంపినందున పిటిషనర్‌ను వెంటనే అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలు తీసుకోరాదని జస్టిస్ కృష్ణ ఎస్ దీక్సిత్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.