CM Siddaramaiah | కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి బదిలీ చేసేందుకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. జస్టిస్ ఎం నాగప్రసన్న కేసును సీబీఐకి బదిలీ చేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేశారు. లోకాయుక్త నిర్వహించిన దర్యాప్తులో ఎక్కడా లోపం ఉన్నట్లుగా.. పక్షపాతంతో వ్యవహరించినట్లుగా కనిపించడం ధర్మాసనం పేర్కొంది.
ముడా కేసును సీబీఐకి బదిలీ చేయాలని సామాజిక కార్యకర్త స్నేహమయి శ్రీకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోకాయుక్త పోలీసులు సరైన దర్యాప్తు చేయలేదని.. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్పై గత నెలలో ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ ఎం నాగప్రసన్న తీర్పును రిజర్వ్ చేశారు. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ వేసిన వ్యక్తికి దర్యాప్తు సంస్థను ఎంపిక చేసే హక్కు లేదని ధర్మాసనం పేర్కొంది. అయితే, పిటిషనర్ తరఫున న్యాయవాది రాజకీయ ఒత్తిడితో దర్యాప్తును పక్కదారి పట్టించవచ్చని.. అసలు నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరారు.
సీఎం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. అన్ని కేసులను సీబీఐకి అప్పగించాలనడం సరికాదని పేర్కొన్నారు. అలా అయితే.. లోకాయుక్త ఎందుకని ప్రశ్నించారు. లోకాయుక్త పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారని అంటున్నారని, సీబీఐ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని గుర్తు చేశారు. ప్రస్తుత సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాదన్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.