బెంగళూరు, నవంబర్ 5: ముడా స్కామ్ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియజేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి క్రిష్ణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తునకు సంబంధించిన రికార్డును కోర్టుకు సమర్పించాలని జస్టిస్ ఎం నాగప్రసన్న లోకాయుక్తను ఆదేశించారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి సీఎంతో పాటు ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, లోకాయుక్తకు కూడా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 26కు వాయిదా వేసింది.
ముడాకు చెందిన 14 స్థలాలను అక్రమంగా తన భార్య పేరున మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) నుంచి కేటాయించుకున్నట్టు కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆరోపణలున్న విషయం తెలిసిందే. గతంలో ఆమె నుంచి ప్రభుత్వం 3.16 ఎకరాల భూమి తీసుకుని దానికి బదులుగా 50:50 శాతం విధానంలో ఆమెకు ముడా 14 ప్లాట్లను కేటాయించింది.
అయితే ఆమె తీసుకున్న భూమి కన్నా ఈ ప్లాట్ల విలువ ఎన్నో రెట్లు అధికమని, పైగా కాసర గ్రామంలో ప్రభుత్వం తీసుకున్న 3.16 ఎకరాల భూమిపై ఆమెకు చట్టబద్ధంగా ఎలాంటి హక్కు లేదని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న లోకాయుక్త పోలీసులు ఆయనను ఒకటో ముద్దాయిగా, ఆయన భార్య పార్వతిని రెండో ముద్దాయిగా చేర్చారు. కాగా, ఆమెను గత నెల 25న లోకాయుక్త విచారించగా, నవంబర్ 6న తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేసింది.