బెంగళూరు: ఒక మహిళ తన భర్త నుంచి నెలకు రూ.6 లక్షలకుపైగా భరణం డిమాండ్ చేసింది. (woman seeks Rs 6 lakh from husband) దీంతో న్యాయమూర్తి ఆ మహిళపై మండిపడ్డారు. కుటుంబ బాధ్యతలు లేని ఒంటరి మహిళకు అంత ఖర్చులు అవసరమా అని ప్రశ్నించారు. ఖర్చుల కోసం ఆమె సంపాదించుకోవాలి తప్ప భర్త కాదని అన్నారు. డిమాండ్లను సవరించకపోతే పిటిషన్ కొట్టివేస్తామని హెచ్చరించారు. రాధ మునుకుంట్ల అనే మహిళ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం భర్త నుంచి నెలకు రూ.6,16,300 భరణం డిమాండ్ చేసింది.
కాగా, ఆగస్ట్ 20న కోర్టులో విచారణ సందర్భంగా తన డిమాండ్లను సమర్థించుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. రాధ నెలవారీ ఖర్చుల వివరాలను ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. దుస్తులు, షూ, బ్యాంగిల్స్, ఇతర ఉపకరణాల కోసం నెలకు రూ.15,000, ఆహారం కోసం నెలకు రూ. 60,000, మోకాళ్ల నొప్పులు, ఫిజియోథెరపీ, వైద్య ఖర్చుల కోసం నెలకు రూ.4 నుంచి రూ.5 లక్షలు ఇప్పించాలని కోర్టును కోరింది.
మరోవైపు భర్త నుంచి నెలకు రూ.6 లక్షలకుపైగా భరణం కోరిన ఆ మహిళపై న్యాయమూర్తి మండిపడ్డారు.
కుటుంబం, పిల్లల బాధ్యతలు లేని ఒంటరి మహిళకు అంత ఖర్చులు అవసరమా అని ప్రశ్నించారు. ప్రాథమిక అవసరాల కంటే విలాసవంతమైన కోరికలను ఆమె ప్రస్తావించినట్లుగా ఉందన్నారు. ‘దయచేసి ఒక వ్యక్తికి అంత అవసరమని కోర్టుకు చెప్పకండి. నెలకు రూ. 6,16,300! ఎవరైనా ఇంత ఖర్చు చేస్తారా? తన కోసం ఖర్చు చేయడానికి ఆమెను సంపాదించనివ్వండి’ అని ఆ మహిళ తరుఫు న్యాయవాదితో అన్నారు. ‘సెక్షన్ 24 ఉద్దేశం అది కాదు. భార్యతో వివాదం ఉన్న భర్తకు శిక్ష కాదు’ అని వ్యాఖ్యానించారు. సహేతుకమైన మొత్తంతో రావాలని న్యాయమూర్తి సూచించారు. లేనిపక్షంలో ఆ మహిళ పిటిషన్ను కొట్టివేస్తామని హెచ్చరించారు.