బెంగుళూరు: కర్నాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah)కు.. హైకోర్టులో చుక్కెదురైంది. ముడా స్కామ్లో సీఎంను విచారించాలని గవర్నర్ థావర్ చాండ్ గెహ్లాట్ చేసిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిద్దరామయ్య కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని బెంచ్ ఈ కేసులో తీర్పును ఇచ్చింది. గవర్నర్ గెహ్లాట్ వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని, ఆయన పూర్తిగా మెదడు పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ నాగప్రసన్న తెలిపారు. అందుకే సీఎంను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి లోపం లేదని హైకోర్టు తెలిపింది.
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సుమారు 14 సైట్లను అక్రమ రీతిలో సీఎం సిద్దరామయ్య భార్యకు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో సీఎం సిద్దును విచారించాలని గవర్న్ గెహ్లాట్ ఆదేశాలు ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం, భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 218 ప్రకారం.. సీఎంను విచారించే అవకాశాలు ఉన్నట్లు గవర్నర్ తన ఆదేశాల్లో తెలిపారు. సిద్దరామయ్య తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ, ప్రొఫసర్ రవివర్మ కుమార్ వాదించారు. ఇక గవర్నర్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడ్వకేట్ జనరల్ శశి కిరణ్ షెట్టి తమ వాదనలు వినిపించారు.