బెంగళూరు : పాఠశాలల యూనిఫాంనకు సంబంధించి 2022 ఫిబ్రవరిలో జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలతో పాటు ప్రీ యూనివర్శిటీ(పీయూ) కళాశాలల్లో విద్యార్థులు నిర్దేశిత యూనిఫాంతోపాటు పరిమిత సంఖ్యలో సంప్రదాయ, మతపరమైన చిహ్నాలను ధరించేందుకు అనుమతినిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
గతంలో ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో ‘హిజాబ్’ వివాదానికి దారి తీశాయి. ‘విద్యార్థులు ధరించే తలపాగా, జంధ్యం, శివదారం, రుద్రాక్ష, హిజాబ్ లాంటి మత పరమైన చిహ్నాలకు అనుమతి ఉంటుంది. అయితే ఇవి విద్యార్థుల క్రమశిక్షణ, భద్రత లేదా గుర్తింపునకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు’ అని ప్రభుత్వం తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.