బెంగుళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముదా) లేఅవుట్ స్కామ్లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah)ను విచారించనున్నారు. అవినీతి కేసులో సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్చాంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో.. ఇవాళ సాయంత్రం ప్రత్యేక క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ముదా లేఅవుట్లో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి ఖరీదైన ప్లాట్లను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముదా లేఅవుట్లో ఎలా ఆమె ఓనర్ అయ్యారని ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. విచారణ కోసం గవర్నర్ గెహ్లాట్ క్లియరెన్స్ ఇవ్వడంతో.. సిద్ధరామయ్యపై కేసు బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యకర్తలు ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ అభ్యర్థనల మేరకు విచారణ కోసం ఆదేశాలు ఇచ్చారు. భారతీయ నాగరికా సురక్షా సంహితలోని సెక్షన్ 17, సెక్షన్ 218 కింద విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.