Green Cess | ప్రజలపై భారం మోపేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. నీటి బిల్లులపై గ్రీన్ సెస్ విధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖండే ఆ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. పర్యావరణ పరంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న పశ్చిమ కనుమలను సెస్ ద్వారా వచ్చే సొత్తుతో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల్లో నీటి బిల్లులపై రూ.2 నుంచి రూ.3 వరకు గ్రీన్ సెస్ విధించే విధంగా ఏడురోజుల్లో ప్రతిపాదనలను సమర్పించాలని కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఆ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో ఆదేశించారు. పశ్చిమ కనుమలను కాపాడేందుకు గ్రీన్ సెస్‌తో నిధిని సృష్టించనున్నట్లు పేర్కొన్నారు.
పశ్చిమ కనుమలు గుజరాత్ నుంచి ప్రారంభమై.. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి వరకు 1600 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. దేశ జనాభాలో దాదాపు 24.5 కోట్ల జనాభాకు నీటివనరులను ఈ పశ్చిమ కనుమలు అందిస్తుంటాయి. కృష్ణా, గోదావరి, కావేరి నదులతో పాటు తుంగ, భద్ర, భీమా, మలప్రభ, ఘటప్రభ, హేమావతి, కాబిని తదితర ఉప నదులకు పుట్టినిల్లు. అంతరించే ముప్పును ఎదుర్కొంటున్న జీవజాతుల జాబితాలో ఉన్న 325 జీవజాతులు ఈ పశ్చిమకనుమల్లో ఉన్నాయి. ఎంతో జీవవైవిధ్యానికి, పర్యావరణ అద్భుతాలకు పశ్చిమ కనుమలు ఆలవాలంగా నిలుస్తున్నాయి.