Dengue | పొరుగు రాష్ట్రమైన కర్ణాటక డెంగ్యూ జ్వరాలతో అల్లాడుతున్నది. ఈ క్రమంలో డెంగ్యూని ఎపిడెమిక్గా ప్రకటించింది. దీంతో పాటు కర్ణాటక ఎపిడెమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2020ని సవరించేందుకు నియమాలను రూపొందించింది. ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 7,362 డెంగ్యూ కేసులు రికార్డయ్యాయి. ఇప్పటివరకు ఏడుగురు మరణించారు. డెంగ్యూ రోగులను చేర్చుకోవడానికి ఆసుపత్రిలోని ప్రతి వార్డులో పది పడకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డెంగ్యూ నివారణకు కార్యాచరణ ప్రణాళికను సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మురికివాడల్లో నివసించే ప్రజలకు దోమతెరలు అందిస్తామని.. ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షించాలని అన్నిశాఖలకు ఆదేశాలు ఇచ్చిననట్లు కర్ణాటక ఆరోగ్యమంత్రి దినేశ్ తెలిపారు. డెంగ్యూ వ్యాప్తిని తగ్గించేందుకు అన్నిశాఖలను కఠినమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇంటింటికి వెళ్లి సేవలు అందించాలని ఆశా వర్కర్స్, వలంటీర్లను కోరామన్నారు. దోమల వ్యాప్తిని నివారించి.. డెంగ్యూ వ్యాప్తిని అరికడతామన్నారు.