RSS | సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కర్నాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కర్నాటకలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కొత్తవేమీ కాదని.. గత బీజేపీ ప్రభుత్వం ఆమోదించిందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. బీజేపీ మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాదనలను తోసిపుచ్చారు. తన ప్రభుత్వ హయాంలో అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఏదైనా ప్రైవేట్ సంస్థ, సంఘం, వ్యక్తుల సమూహం తమ కార్యకలాపాల కోసం ప్రభుత్వ ఆస్తిని, ప్రాంగణాలను ఉపయోగించుకోవడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులో ఆర్ఎస్ఎస్ పేరు స్పష్టంగా చెప్పనప్పటికీ, ఆ ఉత్తర్వులోని నిబంధనలు దాని రూట్ మార్చ్‌లతో సహా సంఘ్ కార్యకలాపాలను ప్రభావితం చేయడానికి ఉద్దేశించినవేనని పేర్కొంటున్నారు.
తన ఉత్తర్వును సమర్థించుకోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం శెట్టర్ నేతృత్వంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన 2013 సర్క్యులర్‌ను ఉదాహారణగా చూపిస్తున్నది. పాఠశాల ఆవరణలు, అనుబంధ ఆట స్థలాలను విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది. సంఘ్‌ను లక్ష్యంగా చేసుకున్నారనే ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ.. అధికార కాంగ్రెస్ పార్టీ, తాము గత బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని మాత్రమే చెబుతున్నది. అయితే, హుబ్లీలో షెట్టర్ మీడియాతో మాట్లాడుతూ జగదీష్ షెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాన్ని తాము (ప్రభుత్వం) కొనసాగిస్తున్నామని ఇప్పుడు చెబుతున్నారని.. ఇది అసలు ఆ ఉద్దేశం కాదన్నారు. ఒక సంస్థ తన కార్యకలాపాలకు పాఠశాల ప్రాంగణాన్ని ఉపయోగించడానికి అనుమతి కోరినప్పుడు విద్యా శాఖ అనుమతి నిరాకరిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఆయన ఇది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం కాదని.. ఇది మొత్తం రాష్ట్రానికి సాధారణ సర్క్యులర్ కూడా కాదన్నారు. దానిలో ఆర్ఎస్ఎస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదన్నారు.