బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు ఈసారి కూడా విలక్షణ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అధికారంలో ఉన్న బీజేపీ లేదా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు మెజార్టీ కట్టబెట్టలేదని ఎగ్జిట్ పోల్స్ (Karnataka Exit Polls) ద్వారా స్పష్టమైంది. దీంతో కర్ణాటకలో హంగ్ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటులో జేడీ(ఎస్) కీలకం కానున్నది.
మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య 113. అయితే పలు మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ లేదా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి ఈ మ్యాజిక్ ఫిగర్ స్థానాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. అయితే అధికారం కాంగ్రెస్ పార్టీ హస్తగతమవుతుందని రెండు ఎగ్జిట్ పోల్స్ పేర్కొనగా, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఒక సర్వేలో తేలింది. బెంగళూరులోని 28 స్థానాల్లో 17 కాంగ్రెస్కు, పది సీట్లు బీజేపీ వస్తాయని అంచనా. అసలు ఫలితాలు ఈ నెల 13న వెల్లడవుతాయి.
Exit Polls