DK Shivakumar | గత కొంతకాలంగా కర్నాటకలో సీఎం మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పలుమార్లు సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏం తొందరపడడం లేదని.. తన భవితవ్యం తనకు తెలుసునన్నారు. పలు మీడియా నివేదికలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని, రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం నవంబర్‌లో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్నది. తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయని మరోసారి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ స్పందించారు.
‘కొందరు సీఎం కావాలనే కోరికను వ్యక్తం చేశారు. సమయం దగ్గర పడుతోందని చెప్పారు అంతే. దాన్ని వక్రీకరించి నేను సీఎం అయ్యే సమయం దగ్గరపడుతోందని చెప్పానని మీడియాలో చూపించకండి. నాకు తొందర లేదు’ అని వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ, తాను రాజకీయాలు చేసేందుకు ఇక్కడకు రాలేదన్నారు. మీడియా తప్పుడు, సంచలనాత్మక వార్తలను ప్రచారం చేస్తే భవిష్యత్‌లో మీకు నేను మద్దతు ఇవ్వను.. ఎలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనని.. పిలవకుండా రాజకీయాలు ఎలా చేయాలో తనకు తెలుసునన్నారు. తాను సీఎం అయ్యే సమయం ఆసన్నమైందని చెప్పినట్లుగా మీడియాకు ఎవరు చెబుతున్నారని..? నేను అలా ఎప్పుడు చెప్పానని ప్రశ్నించారు. తనకు అలా చెప్పాల్సిన అవసరం లేదని.. తన గమ్యం ఏంటో తనకు తెలుసునన్నారు. దేవుడు నాకు ఏ అవకాశం ఇచ్చాడో.. ఆ అవకాశం ఇప్పుడు ఇస్తాడో తనకు తెలుసునన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని, బెంగళూరు ప్రజలకు మంచి పాలన అందించాలని తాను కోరుకుంటున్నానన్నారు.
ఆ ఉద్దేశంతోనే తాను తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే.. తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే మీడియాపై పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో మరోసారి సీఎం మార్పు తథ్యమని కొంతకాలంగా వార్తలు ఊహాగానాలున్నాయి. అయితే, తానే ఐదేళ్లు సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 2023 మే నెలలో కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. పార్టీ హైకమాండ్ మంతనాలతో డీకే శివకుమార్ వెనక్కి తగ్గారు. అయితే, శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరూ రెండున్నర సంవత్సరాలు సీఎంగా పని చేసేందుకు అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై స్పష్టత లేదు. తాజాగా సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మరోసారి సీఎం మార్పుపై చర్చ సాగుతున్నది.