Karnataka | బెంగళూరు: కర్ణాటకలో అభివృద్ధి పనులకు బ్రేకులు పడుతున్నాయి. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి పనులు జరిపామని, ఇక బిల్లులు రాకపోతే పనులు కొనసాగించలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలనే యావతో ఇచ్చిన గ్యారెంటీలే ఇప్పుడు రాష్ట్రం పాలిట గుదిబండగా, అభివృద్ధికి అడ్డంకిగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటకలో గత ఏడాది మే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటప్పటికి కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం మారాక తమ బిల్లులు మంజూరవుతాయని ఆశించారు. కానీ, బిల్లుల బకాయిలు రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు పెరిగాయి. దీంతో కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు వేగంగా జరపడం లేదు. చాలా పనులు నిలిచిపోయాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికె సైతం కాంట్రాక్టర్లకు రూ.3,200 బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో నగరంలో పనులు వేగంగా జరగడం లేదు.
బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం సీనియారిటీ నిబంధనలను పాటించడం లేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారికి అనుకూలమైన కాంట్రాక్టర్లకు మొదట బిల్లులు చెల్లిస్తున్నారని వాపోతున్నారు.