న్యూఢిల్లీ, ఆగస్టు 23: చట్ట విరుద్ధంగా బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర అలియాస్ పప్పీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శనివారం సిక్కింలో అరెస్టు చేశారు. రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల దాడులు జరిపిన ఈడీ అధికారులు వీరేంద్రకు దుబాయ్‌లోని అంతర్జాతీయ క్యాసినోలు, గేమింగ్ రాకెట్లతో సహా చట్ట వ్యతిరేక బెట్టింగ్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాతో సహా అనేక రాష్ర్టాలలో శుక్ర, శనివారాలలో ఈడీ దాడులు నిర్వహించింది. గోవాలోని క్యాసినోలు లక్ష్యంగా ఈడీ దాడులు జరిపింది. కాల్ సెంటర్ సర్వీసెస్, గేమింగ్ కార్యకలాపాలతో ముడిపడిన మూడు సంస్థలను వీరేంద్ర సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్‌లో నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
ఎంజీఎం, బెల్లాజియో, మెట్రోపాలిటన్, మరీనా, క్యాసినో జువెల్కు చెందిన అనేక అంతర్జాతీయ క్యాసినో మెంబర్షిప్ కార్డులను, తాజ్, హయత్, లీలాకు చెందిన లగ్జరీ హోటల్ మెంబర్షిప్ కార్డులను, హైవాల్యూ కెడ్రిట్, డెబిట్ కార్డులను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడులలో రూ. 12 కోట్ల నగదు, రూ.1 కోటి విలువైన విదేశీ కరెన్సీని అధికారులు కనుగొన్నారు. రూ. 6 కోట్ల విలువైన బంగారు నగలు, రూ.10 కిలోల వెండి ఆభరణాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 0003 అనే ఒకే వీఐపీ నంబర్‌తో ఉన్న మూడు లగ్జరీ కార్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరేంద్రను సిక్కింలోని కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు ట్రాన్సిట్ రిమాండుతో బెంగళూరు కోర్టులో హాజరుపరచనున్నారు.