బెంగళూరు: బీజేపీ ఎంపీని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే (Karnataka Congress MLA Shamanur Shivashankarappa ) కొనియాడారు. ఆయన మంచి పనులు చేస్తున్నారని మెచ్చుకున్నారు. తిరిగి ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, బీజేపీ ఎంపీ బీవే రాఘవేంద్ర మంచి పనులు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప కొనియాడారు. శివమొగ్గలో గురుబసవశ్రీ పురస్కారం అందుకున్న ఆయన, బీజేపీ ఎంపీ రాఘవేంద్రను మళ్లీ ఎన్నుకోవాలని స్థానిక ప్రజలను కోరారు. ‘శివమొగ్గ జిల్లాలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గమనించా. మీరు మంచి ఎంపీని ఎన్నుకున్నారు. ప్రజలు మళ్లీ ఆయనను ఎన్నుకోవాలి. జిల్లా మరింత అభివృద్ధి చెందాలి. బీవై రాఘవేంద్ర వంటి లోక్సభ సభ్యులు ఉండటం మీ అదృష్టం. అన్ని పనులు జరుగాలి. అభివృద్ధి చేస్తున్న వారికే ప్రజలు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి’ అని ఆధ్యాత్మిక సదస్సులో అన్నారు.
Bjp Mp
కాగా, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే శివశంకరప్ప వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రాఘవేంద్ర స్పందించారు. తన రాజకీయ జీవితంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఇది ఒకటని అన్నారు. ‘శివశంకరప్ప నా అభివృద్ధి పనులను అభినందించడం నేను వందేళ్లు పూర్తి చేసుకున్నట్లుగా భావిస్తున్నా. సమగ్రాభివృద్ధికి మరింత కృషి చేస్తా. నాపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సంకల్పించా. శివమొగ్గ లోక్సభ నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా’ అని అన్నారు.