Karnataka | హైదరాబాద్, జనవరి 8 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నది. ఏకీకృత ఫీజు విధానం పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేట్ యూనివర్సిటీల్లో ఫీజుల పెంపునకు సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు కర్ణాటక హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (కేహెచ్ఈసీ) నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆమోద ముద్ర వేసింది. నివేదికలోని ప్రధానాంశాలు అమల్లోకి వస్తే, రాష్ట్రంలోని 32 వర్సిటీల్లో ఏటా 10 శాతం లేదా రెండేండ్లకు ఒకసారి 20-25 శాతం ఫీజుల పెంపు జరుగనున్నది.
మరోవైపు, ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ వర్సిటీల్లో ఫీజులను తగ్గించాల్సింది పోయి పెంచడమేంటని ఆలిండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఏఐడీఎస్వో-మైసూరు) నేతలు ప్రశ్నించారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐదు గ్యారంటీల ప్రచారంతో గత మేలో కర్ణాటక పీఠాన్నెక్కిన కాంగ్రెస్ సర్కారు.. ‘యువనిధి’ స్కీంను ఏడు నెలల తర్వాత జనవరి 1న ప్రారంభించింది. ఎక్కడాలేని నిబంధనలు పెట్టడంతో గత శుక్రవారంనాటికి 30 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వ హామీ మేరకు డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్నవారికి నెలకు రూ. 3 వేలు, డిప్లొమా వారికి రూ.1,500 చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటికే, మిగతా స్కీంల అమలుకు ఆర్థికపరంగా మల్లగుల్లాలు పడుతున్న సర్కారుకు ‘యువనిధి’ పథకం మరో భారంగా మారింది. ఇదేసమయంలో వర్సిటీల్లో ఫీజులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం దుమారాన్ని రేపుతున్నది. ‘ఫీజుల పెంచి విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఆ డబ్బును.. నిరుద్యోగ భృతిగా చెల్లిస్తారా?’ అంటూ ప్రభుత్వంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.