న్యూఢిల్లీ : కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బలవన్మరణానికి పాల్పడటంపై కాంగ్రెస్ పార్టీ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. ఈ ఘటనకు సంబంధించి కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప రాజీనామా చేయాలని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు వచ్చిన తన కేబినెట్ సహచరుడిపై చర్యలు తీసుకోవడంలో సీఎం బసవ్‌రాజ్ బొమ్మై విఫలమయ్యారని ఆరోపించారు. ఘటనపై ప్రాధమిక నివేదవిక అనంతరం చర్యలు ఉంటాయని బొమ్మై స్పష్టం చేశారు.
వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని..ఈ విషయంలో పోలీసులు ఎవరి జోక్యం లేకుండా స్వత్రంత్ర దర్యాప్తు చేపడుతున్నారని చెప్పారు. మరోవైపు పాటిల్ (ఆత్మహత్య) మరణానికి మంత్రి ఈశ్వరప్పే కారణమని ఈ విషయం పాటిల్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా అన్నారు. ఈశ్వరప్పను తక్షణమే అరెస్ట్ చేయాలని, లేకుంటే తాము సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని సీఎం రాజీనామాకూ డిమాండ్ చేస్తామని సుర్జీవాలా స్పష్టం చేశారు.
కాగా ఈనెల 11 నుంచి అదృశ్యమైన బీజేపీ సభ్యుడు, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ కర్నాటకలోని ఉడిపిలో మంగళవారం విగతజీవిగా కనిపించాడు. కర్నాటక మంత్రి ఈశ్వరప్ప ఓ ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం విలువైన మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేశాడని సంతోష్ పాటిల్ ఆరోపించారు. మంత్రిపై ఆరోపణలు చేసిన అనంతరం పాటిల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనపై ఈశ్వరప్ప రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు బెంగళూరులో ఆయన నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టారు.