
బెంగళూర్ : కర్నాటక సీఎం పదవి నుంచి బీఎస్ యడియూరప్పను తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆయన కుమారుడు బీవై విజయేంద్ర శనివారం ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. యడియూరప్ప రెండేండ్ల పదవీకాలం ఈనెల 26న పూర్తికానుండటంతో అదే రోజున హైకమాండ్ కీలక నిర్ణయం వెల్లడించనుంది. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని యడియూరప్ప స్పష్టం చేశారు.
నాయకత్వ మార్పుపై పార్టీ పెద్దలు తనతో ఇప్పటివరకూ మాట్లాడలేదని 26న ఏం జరుగుతుందో వేచిచూడాలని చెప్పారు. సీఎం పదవి నుంచి తనను తొలగిస్తే పార్టీ పటిష్టతపై దృష్టిసారిస్తానని వెల్లడించారు. ప్రత్యామ్నాయ నేతగా తాను ఎవరి పేరునూ సూచించలేదని తెలిపారు. కాగా సీఎం రేసులో నిలిచిన కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ నాయకత్వ మార్పుపై స్పందించారు. కర్నాటక సీఎం పదవిపై పార్టీ నేతలు తనతో ఇప్పటివరకూ సంప్రదించలేదని, ఊహాగానాలపై తాను వ్యాఖ్యానించలేనని చెప్పారు.