బెంగుళూరు : కర్నాటకలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ మేనేజర్ .. కన్నడ భాషలో మాట్లాడేందుకు నిరాకరించింది. కస్టమర్‌తో హిందీ తప్ప మరో భాషలో మాట్లాడబోనని తేల్చి చెప్పింది. బ్యాంక్ మేనేజర్, కస్టమర్ మధ్య జరిగిన వాగ్వాదానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. కన్నడ భాష మాట్లాడలేకపోయిన ఆ బ్యాంక్ మేనేజర్‌ను బదిలీ చేసినట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు. సూర్యనగర్ బ్రాంచీకి చెందిన బ్యాంక్ మేనేజర్ ప్రవర్తన సరిగా లేదన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక భాషను గౌరవించడం అంటే ప్రజల్ని గౌరవించినట్లే అని పేర్కొన్నారు. ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తూ ఎస్బీఐ వెంటనే తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ సమస్య ఇంతటితో ముగిసినట్లుగా భావించాలన్నారు.
The behaviour of the SBI Branch Manager in Surya Nagara, Anekal Taluk refusing to speak in Kannada & English and showing disregard to citizens, is strongly condemnable.
We appreciate SBI’s swift action in transferring the official. The matter may now be treated as closed.…
— Siddaramaiah (@siddaramaiah) May 21, 2025
బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు అందరూ కన్నడ భాషలో మాట్లాడాలన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగరాదు అని తెలిపారు. కస్టమర్లతో బ్యాంకు ఉద్యోగులు మర్యాదగా ప్రవర్తించాలని, స్థానిక భాష మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు. బ్యాంకు సిబ్బందికి సంస్కృతి, భాషా సంబంధిత అంశాల్లో శిక్షణ ఇప్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని సీఎం సిద్దరామయ్య కోరారు.
ఓ మహిళా బ్యాంక్ మేనేజర్ .. కస్టమర్ ఎంత కోరినా .. కన్నడ భాషలో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇది కర్నాటక అని ఆ కస్టమర్ పేర్కొన్నా.. నువ్వేమీ నాకు ఉద్యోగం ఇవ్వలేదని ఆ ఆఫీసర్ జవాబు ఇచ్చారు. ఇది కర్నాటక అని మరోసారి అనగా, ఇది ఇండియా అని ఆమె అన్నారు. నీ కోసం కన్నడ మాట్లాడను అని ఆమె అన్నారు. హిందీ మాత్రమే మాట్లాడతానని చెప్పారు. ఎస్బీఐ బ్రాంచీకి గుణపాఠం నేర్పాలని కస్టమర్ అరుస్తున్నట్లు వీడియోలో ఉన్నది. ఆ వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.