బెంగుళూరు: కర్నాటకలోని శివమొగ్గంలో సోమవారం సింగందుర్ బ్రిడ్జ్‌ను కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంబించారు. దేశంలోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ అది. ఆ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినట్లు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సోమవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారని, ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా తన పేరును ఆహ్వాన పత్రికలో వాడినట్లు సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అయిష్టత వ్యక్తం చేసినా.. కేంద్ర మంత్రి కేబుల్ బ్రిడ్జ్ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఇది సహకార సమాఖ్య విధానాన్ని విస్మరించినట్లు అవుతుందని పేర్కొన్నారు. టెక్నికల్ రిపోర్టు ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదని, దాన్ని ఓపెన్ చేయకుండా ఉండాల్సి ఉందన్నారు.
కేంద్ర మంత్రి గడ్కరీ సోమవారం కర్నాటకలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింగందుర్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన కేబినెట్ బహిష్కరించింది. జూలై 11వ తేదీన గడ్కరీతో మాట్లాడనని, ఆ ప్రోగ్రామ్‌ను వాయిదా వేసుకోవాలని కోరానని సీఎం గుర్తు చేశారు. వాయిదా చేస్తానని మంత్రి అంగీకరించారని, కానీ గుట్టు చప్పుడు కాకుండా ఆ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించినట్లు సీఎం సిద్ధరామయ్య తన లేఖలో ఆరోపించారు.
సుమారు రెండు వేల కోట్ల విలువైన రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారని, తమకు చెప్పకుండానే ఆ కార్యక్రమాలు నిర్వహించారని ప్రధానికి రాసిన లేఖలో సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా మంత్రి గడ్కరీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని, ఆహ్వాన పత్రికలో మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప పేరును ముందుగా ప్రచురించారని, ప్రస్తుత డిప్యూటీ సీఎం, స్పీకర్ పేర్లను ప్రచురించలేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి గడ్కరీ చర్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి మళ్లీ జరగకుండా చూడాలని కోరుతున్నట్లు లేఖలో తెలిపారు.
I have written a letter to Prime Minister @narendramodi regarding a breach of protocol that occurred today at the event organized by the Union Ministry of Road Transport and Highways and the National Highways Authority in Sagar, Shivamogga district. pic.twitter.com/AKtkb5tzr2
— Siddaramaiah (@siddaramaiah) July 14, 2025