Karnataka Politics : కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీతో శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆ పార్టీ ఎంపీ రణ్‌దీప్ సుర్జీవాలా కూడా పాల్గొన్నారు. ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్య విచారణకు కర్నాటక గవర్నర్ అనుమతించిన క్రమంలో నెలకొన్న పరిణామాలపై పార్టీ అగ్రనేతలతో కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించినట్టు తెలిసింది.
గవర్నర్ నిర్ణయంతో కర్నాటకలో నెలకొన్న రాజకీయ గందరగోళం, బీజేపీ చేపడుతున్న నిరసనలపైనా నేతలు సమాలోచనలు సాగించినట్టు సమాచారం. మరోవైపు ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యపై కాషాయ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. సీఎంను టార్గెట్ చేసి తమ ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలని బీజేపీ నేతలు కుట్రపన్నారని ఆరోపించారు. మంత్రి హుబ్బలిలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ముడా స్కామ్‌లో సీఎం ఎలాంటి తప్పూ చేయలేదని అన్నారు. అధికార దుర్వినియోగం జరగలేదని చివరికి విపక్షానికీ తెలుసని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నేతలంతా సిద్ధరామయ్య వెన్నంటి ఉన్నారని చెప్పారు. ఈ ఘటన అనంతరం పార్టీలో మునుపెన్నడూ లేని ఐక్యత నెలకొందని చెప్పారు. అవినీతి మన వ్యవస్ధలో వేళ్లూనుకుందని, ఎక్కడైనా అవినీతి జరిగితే దానిపై చర్యలు చేపట్టాలని, చట్ట ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుందని దినేష్ గుండూరావు పేర్కొన్నారు.
Read More :
Toofan | ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ తుఫాన్.. ఏ ప్లాట్ఫాంలోనంటే..?