బెంగళూరు, సెప్టెంబర్ 19: కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఏక్షణమైనా కూలొచ్చని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని ఆయన అన్నారు. ‘భవిష్యత్‌పై జోస్యం చెప్పడంపై నాకు నమ్మకం లేదు. అయినప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐదేండ్ల పాటు పాలన చేయలేదని కచ్చితంగా చెప్పగలను’ అని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు దేశం పార్టీ, బీహార్‌లోని జేడీ(యూ) సహాయంతో మోదీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారని, వారు ఏ క్షణంలోనైనా తమ మద్దతు ఉపసంహరించుకోవచ్చునని ఆయన అన్నారు. కర్ణాటకలో తన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ప్రస్తావిస్తూ తమకు 136 సీట్లు ఉన్నాయని, అలాంటప్పుడు ప్రభుత్వం ఎలా మారుతుందని ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్న అలాంటి విమర్శలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వమని సిద్ధరామయ్య అన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలపై రూ.387 కోట్ల వ్యయంతో జరిగిన పనులపై నివేదిక అందజేయాలని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రాజ్నీశ్ను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్ ఆదేశించారు. సిద్ధరామయ్య సొంత నియోజకవర్గమైన వరుణతో పాటు శ్రీరంగపట్నలో మైసూరు అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ (ముడా) నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టిందని పీఎస్ నాగరాజు అనే వ్యక్తి తనకు ఫిర్యాదు చేసినట్టు గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు.
ముడా వద్ద నిధులు లేకపోయినా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేపట్టిందని తన దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. ఇది తీవ్రమైన అంశమని, దీనిపై డాక్యుమెంట్లతో పాటు సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను గవర్నర్ ఆదేశించారు. కాగా, ఇప్పటికే ముడా భూకుంభకోణం కేసులో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. గవర్నర్ నిర్ణయాన్ని సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేయగా, తీర్పు రిజర్వులో ఉంది.