Karnataka CM : కర్ణాటకలో సీఎం పదవి మార్పుపై చాలా రోజులుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను తొలగించి, డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌ను సీఎం చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్యను ఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. ఈ పరిణామాలను బట్టి కర్ణాటక సీఎంను మార్చడంతోపాటు మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టతా లేదు. ఈ మేరకు తనకు ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అందించిన సమాచారం మేరకు ఢిల్లీ వెళ్తున్నట్లు సీఎం చెప్పారు. మంగళవారం కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం జరగనుందని ఆయన చెప్పారు. అయితే, ఏ అంశంపై తనను ఢిల్లీకి పిలిచారో తెలియలేదన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా ముసలం నడుస్తోంది. 2023లో అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది.
ఈ సమయంలో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య భారీ పోటీ నడిచింది. ఆ సమయంలో ఇద్దరూ తమ వర్గపు ఎమ్మెల్యేలతో హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేశారు. కానీ, సీనియర్ అయిన సిద్ధరామయ్య వైపు హైకమాండ్ మొగ్గుచూపింది. అయినప్పటికీ కొంతకాలం తర్వాత సిద్ధరామయ్యను తొలగించి, డీకేను సీఎం చేస్తారని ప్రచారం మొదలైంది. కానీ, సిద్ధరామయ్య మాత్రం తానే ఐదేళ్లు సీఎంగా ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు హైకమాండ్ నుంచి పిలుపురావడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది.
మరోవైపు మంత్రివర్గంలో మార్పులు జరగనుందని ప్రచారం మొదలవ్వడంతో చాలా మంది ఆశావహులు తమ లాబీయింగ్ మొదలుపెట్టారు. ఎవరికి వారు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని హైకమాండ్‌ను కోరుతున్నారు. ఏదేమైనా సీఎం మార్పు, మంత్రివర్గంలో మార్పుపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.