బెంగళూరు, సెప్టెంబర్ 20: గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సంగతి. హైదరాబాద్లో వెల్కమ్ 40% సీఎం అనే హోర్డింగులపై ఆయన స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్లో ఇటీవల వెలసిన ఆ హోర్డింగుల వెనుక పథకం ప్రకారం పన్నిన పెద్ద కుట్ర ఉందని బొమ్మై అన్నారు. అసలు సంగతేమిటంటంటే ఆ హోర్డింగుల్లో ఎక్కడా ఆయన పేరు లేదు. కమిషన్ అనే మాటలోని సీ, ఎం అనే అక్షరాలను కొద్దిగా పెంచి ‘సీఎం’ అని కనిపించేలా పెట్టారు.
‘హైదరాబాద్లో పెట్టిన హోర్డింగుల గురించి విన్నాను. అవి ప్రైవేటువా లేక ప్రభుత్వానివా? అనేది తెలియదు. ఒక సీఎంపై అలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుమతించి ఉండరాదు’ అని ఆయన మీడియాతో అన్నారు. బీజేపీ గతవారం నిర్వహించిన విముక్తి సభకు కేంద్ర హోంమంత్రి, కర్ణాటక సీఎం తదితరులను ఆహ్వానించింది. సభాస్థలికి సమీపంలో సదరు హోర్డింగులు కనిపించాయి. కర్ణాటకలో కాంట్రాక్టర్లు అక్కడి ప్రభుత్వం ప్రాజెక్టు సొమ్ములో 40 శాతం లంచంగా అడుగుతున్నదని ప్రకటించి సంచలనం కలిగించారు. ఈ నేపథ్యంలో బొమ్మై ఆ హోర్డింగ్ తనను ఉద్దేశించే పెట్టారని నిర్ణయించేసుకున్నారు. సభకు వెళ్లలేదు కనుక హోర్డింగులను తాను స్వయంగా చూడలేదని అన్నారు. పేరు కూడా లేనప్పుడు ఆయన ఉడుక్కోవడం దేనికని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ చురక వేశారు.